విజయవాడ, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.22,177.84 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 19,739 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఇంధన రంగానికి సంబంధించి రూ.5,176.56 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో శ్రీసత్యసాయి జిల్లాలో 675 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతో పాటు వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల్లో సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రంగంలో సుమారు 2,240 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ.4,332.49 కోట్ల పెట్టుబడులు, ఆహార ప్రాసెసింగ్ రంగానికి రూ.3,734.18 కోట్ల పెట్టుబడులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి రూ.526.25 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.
విశాఖపట్నంలో Deloitte IT/ITES క్యాంపస్, Muthoot Fincorp AI-Tech Training Centre ఏర్పాటుతో పాటు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మచిలీపట్నం పోర్టులో Goa Shipyard Limitedకు 400 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడితో షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 8,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
అమరావతిలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన కీలక మౌలిక వసతుల పనులకు రూ.1,548.98 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతిని కూడా కేబినెట్ ఇచ్చింది.
అలాగే రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.