విశాఖపట్నం, అక్టోబర్ 13: రానున్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తామని రాధా రంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ తెలిపారు. మద్దిలపాలెంలోని కళాభారతి వేదికగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని బాలాజీ పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలోని మొత్తం 120 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని, జనసేన పార్టీకి మద్దతుగా పనిచేస్తామని వెల్లడించారు.
జనసేన కోసం పనిచేస్తా: గాదె బాలాజీ
గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో తనపై పలు కేసులు నమోదు చేశారని గాదె బాలాజీ ఆరోపించారు. అప్పట్లో ఓ మాజీ ఎమ్మెల్యే తనతో వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలను కూడా ఆయన గుర్తుచేశారు. తనలో ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరు
ఈ సమావేశానికి విశాఖ నగరంలోని పలు ప్రాంతాల నుంచి యువకులు, మహిళలు, పార్టీ అభిమానులు హాజరయ్యారు. కొబ్బరితోట, అక్కయ్యపాలెం, జగదాంబ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు గాదె బాలాజీని ఘనంగా సత్కరించి అభినందించారు.
కార్యక్రమంలో కర్రీ వెంకటరమణ, వలి రెడ్డి శ్రీనివాస్, సంతోష్ కుమార్ సింగ్, పసుపులేటి మురళి, ఊరుకుటి పద్మతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని సమావేశంలో నేతలు పేర్కొన్నారు.