వెలిచేరు: ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా పాలనను ప్రజల చెంతకు చేరువ చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 86 వినతులు అందినట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ.. ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందన్నారు. అందిన వినతుల్లో పరిష్కరించాల్సిన మిగిలిన సమస్యలను కూడా వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.