విశాఖపట్నం: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కోరాడ రామారావు వారికి పలు సూచనలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరూ అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని, చట్ట పరిధిలోనే వ్యవహరించాలని సీఐ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని స్పష్టం చేశారు. దసరా పండుగ నేపథ్యంలో మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో హల్‌చల్ చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం సహించబోమని హెచ్చరించారు.
తమపై నిఘా ఉంటుందని, ఎవరిపైనైనా ఫిర్యాదు అందితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కోరాడ రామారావు స్పష్టం చేశారు. పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఎస్‌ఐలు భాస్కరరావు, అజయ్, బాలకృష్ణ పాల్గొన్నారు.