విశాఖపట్నం:
రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరమ్ (RYSF) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎన్. ప్రేమ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా DEO ఎన్. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సర్దార్ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి అమరవీరుల పోరాట స్ఫూర్తితో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై RYSF పోరాటాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే సేవా కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
RYSF రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి చామల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసే నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ప్లీనరీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు RYSF ప్రతినిధులు తెలిపారు. సమావేశాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ఉత్తరాంధ్రలో విద్యార్థులు, యువత సమస్యలపై ఉద్యమాలతో పాటు సేవా, చైతన్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్లీనరీ సమావేశాలు దిశానిర్దేశం చేయనున్నట్లు RYSF నాయకులు తెలిపారు.