విశాఖపట్నం వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉత్తరాంధ్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, సాగునీరు, పారిశ్రామిక ప్రగతి, గిరిజన హక్కులు తదితర అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని ఆయన పేర్కొన్నారు. తాను సీఎం అభ్యర్థిని కాదని, యువతరం నుంచే పాలకులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆయన గతంలోనూ ప్రకటించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. నీటిపారుదల, తాగునీరు, రహదారులు, వలసల నివారణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వంశధార సహా నదుల నీటి వినియోగం, నదుల అనుసంధానం, ఉత్తరాంధ్రను కరువు రహిత ప్రాంతంగా మార్చే చర్యలపై దృష్టి పెడతామని చెప్పారు.
ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి పెంచాలని అన్నారు. గీతం భూముల వ్యవహారంపై ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఇప్పటికే జరిగిన అభివృద్ధిని కొనసాగించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
గిరిజన ప్రాంతాల్లో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను పటిష్టంగా అమలు చేయడం, గిరిజనుల చట్టబద్ధ హక్కులు, సంస్కృతి–సంప్రదాయాలను పరిరక్షించడం, గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపడతామని ప్రకటించారు.