విశాఖపట్నం: కుటుంబంలో చోటుచేసుకున్న ఘర్షణ గ్యాస్ సిలిండర్ లీకేజీ ఘటనకు దారితీయడంతో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని చంద్రంపాలెంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్. గోవిందరావు (55), ఆయన కుమారుడు త్రినాథ్ (24) మధ్య కుటుంబపరమైన విషయాలపై గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో గ్యాస్ లీక్ చేసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గోవిందరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ గోవిందరావు మృతి చెందినట్లు పీఎం పాలెం పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో కుమారుడు త్రినాథ్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.