అమరావతి, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఏపీ సచివాలయంలో ఆయన పీఆర్సీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దినేష్ కుమార్ గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ నెల 1వ తేదీన ఆయనను 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 200 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏడాదిలోగా పీఆర్సీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దినేష్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి పూర్తి వివరాలను తీసుకుని అధ్యయనం చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదికను నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
పీఆర్సీ చైర్మన్‌కు అధికారుల శుభాకాంక్షలు
దినేష్ కుమార్ పీఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, అదనపు కార్యదర్శి గౌతమ్ అల్లాడ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
12వ పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించిన అంశాలపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే వేతనాల పెంపు శాతం, అమలు తేదీ, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం.