మచిలీపట్నం: అభివృద్ధి, సమస్యల పరిష్కారం గురించి వైసీపీ నాయకులు చెబుతున్న శ్రీరంగనీతులు చెల్లవని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్, లోగిశెట్టి వెంకటస్వామి, పిప్పళ్ళ వెంకన్న, సమతా కీర్తి, దింటకుర్తి సుధాకర్, ఇలియాస్ పాషా, అబ్దుల్ అజీమ్, రాజు, బొడ్డు శ్రీను తదితరులు మాట్లాడారు.
మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి రాద్ధాంతం చేయడం సరైన పద్ధతి కాదని వారు విమర్శించారు. మున్సిపల్ అధికారులతో ఆయన వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని అన్నారు.
మున్సిపాలిటీలో పారిశుధ్యం, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, కార్మికులకు వేతనాల చెల్లింపు వంటి అంశాలపై పేర్ని కిట్టు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీని అప్పులు, గోతులతో వదిలివెళ్లారని, ప్రస్తుతం వాటిని అధిగమిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
చిన్నచిన్న అంశాలను రాజకీయంగా రాద్ధాంతం చేస్తూ ప్రచారం పొందేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి వైఖరిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర పనితీరుపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని టీడీపీ నాయకులు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి కొల్లు రవీంద్ర అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు తీసుకువస్తున్నారని చెప్పారు.
మంత్రి కొల్లు రవీంద్రపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మచిలీపట్నం అభివృద్ధికి బాటలు పడ్డాయని, ఇది ప్రజలకు తెలిసిన విషయమని అన్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో మున్సిపాలిటీలో అడ్డగోలు పెత్తనం చేశారని పేర్ని కిట్టుపై టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు అదే నాయకులు ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా రాజకీయ విమర్శల పేరుతో చేస్తున్న ఆరోపణలను, విమర్శలను కట్టిపెట్టాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ప్రజలపై ప్రేమ ఉన్నట్లు, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు వైసీపీ నాయకులు మాట్లాడినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. గత పాలన, తమ అధికార కాలంలో జరిగిన పరిణామాలను ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు.
మచిలీపట్నంతో పాటు కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న కృషిని ప్రజలు గుర్తిస్తున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, పడుతున్న శ్రమను ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు. మంత్రి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వైసీపీ నాయకులు చేసే విమర్శలు చెరపలేవని వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా కార్యక్రమం నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులకు అది మింగుడు పడటం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. అందుకే ఏదో ఒక కారణంతో బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.