బొబ్బిలి, విజయనగరం జిల్లా: ఢిల్లీలో ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్, రైతు సంఘాల నాయకులు బొబ్బిలిలో నిరసన చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్‌లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఢిల్లీలో ఆందోళన చేపట్టిన వామపక్షాలు, కాంగ్రెస్‌కు చెందిన యువకులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయత దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, రైతు సంక్షేమ సంఘం నాయకులు పి. శంకరరావు, మువ్వల శ్రీనివాసరావు, ఒమ్మి రమణ, మెరుగాని గోపాలు, వేమిరెడ్డి లక్ష్మీనాయుడు తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారిపై లాఠీచార్జి చేయడం, కేసులు నమోదు చేయడం, అరెస్టులతో భయపెట్టడం ప్రజాస్వామ్యానికి, పౌర హక్కులకు విఘాతమని విమర్శించారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపు జరిగిందని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ప్రజలు, యువత, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో సింగిరెడ్డి గోపాలు, ఈ. శేషగిరి, మునకాల శ్రీను, మండపాక శ్రీను, జి. వాసుతో పాటు వివిధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.