దసరా పండుగ తేదీలపై విశాఖ పండితుడు అంజనీ కుమార్ స్పష్టత.. 19న మహర్నవమి, 20న జమ్మి పూజతో నవరాత్రుల ముగింపు
విశాఖపట్నం: దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? విజయదశమి ఏ రోజు జరుపుకోవాలి? అనే సందేహాలకు విశాఖకు చెందిన పండితుడు అంజనీ కుమార్ స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 11న పాడ్యమి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అక్టోబర్ 20న విజయదశమి జరుపుకోవాలని తెలిపారు.
అక్టోబర్ 10వ తేదీ రాత్రి వరకు అమావాస్య తిథి ఉండటంతో, మరుసటి రోజు పాడ్యమి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. అక్టోబర్ 19న మహర్నవమి, 20న విజయదశమి పర్వదినాలను నిర్వహించుకోవాలని సూచించారు.
విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ
దసరా పండుగలో శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విజయదశమి రోజున సాయంత్రం జమ్మి చెట్టును పూజించి, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పూజతో శరన్నవరాత్రి వేడుకలు ముగుస్తాయని పండితుడు అంజనీ కుమార్ వివరించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో పూజిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటారు.