పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై పరిశ్రమలకు రూ.16.32 కోట్ల పర్యావరణ పరిహారం
కాలుష్య నియంత్రణ ప్రమాణాల ఉల్లంఘనలపై చర్యలు.. నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
విశాఖలో 8 మాన్యువల్ స్టేషన్లు, 3 CAAQMS.. నవంబర్ నాటికి మరో 5 IoT సెన్సార్ స్టేషన్లు
విశాఖపట్నం, అక్టోబర్ 08: విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు మెరుగైన వాయు నాణ్యతను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) పర్యావరణ పర్యవేక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసింది. పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత వాయు నాణ్యత ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు ఏపీపీసీబీ వెల్లడించింది.
పరిశ్రమలకు రూ.16.32 కోట్ల పర్యావరణ పరిహారం
2025 డిసెంబర్‌లో విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్య స్థాయులు పెరిగిన నేపథ్యంలో కొన్ని పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు, పొగ కారణంగా వాయు నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఏపీపీసీబీ గుర్తించినట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో పరిశ్రమలు నిర్దేశిత ఉద్గార ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, కాలుష్య నియంత్రణ పరికరాలను సమర్థవంతంగా నిర్వహించాలని, అధిక స్థాయిలో పొగ, కాలుష్య ఉద్గారాలు వెలువడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.
అయితే పర్యవేక్షణ, వరుస తనిఖీలు, నోటీసులు జారీ చేసినప్పటికీ వాయు కాలుష్య పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించకపోవడంతో పరిశ్రమల కార్యకలాపాలపై మరింత కఠినంగా దృష్టి సారించినట్లు ఏపీపీసీబీ తెలిపింది.
ఈ క్రమంలో కొన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించి, నిబంధనల ప్రకారం Environmental Compensation (పర్యావరణ పరిహారం) విధించినట్లు వెల్లడించింది.
విశాఖపట్నం పరిధిలోని కొన్ని పరిశ్రమలపై మొత్తం రూ.16,32,75,000 (రూ.16.32 కోట్లు) పర్యావరణ పరిహారం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఏపీపీసీబీ తెలిపింది.
జనవరిలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
వాయు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా 2026 జనవరిలో టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా పలు పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఏపీపీసీబీ తెలిపింది.
ఈ తనిఖీల్లో వాయు నాణ్యత ప్రమాణాలను పాటించడంలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన పరిశ్రమలకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొంది.
పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
8 మాన్యువల్ స్టేషన్లు.. 3 CAAQMS
విశాఖ నగరంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం 8 మాన్యువల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయని ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య తెలిపారు.
రియల్‌టైమ్‌లో వాయు నాణ్యతను పర్యవేక్షించేందుకు మరో 3 Continuous Ambient Air Quality Monitoring Stations (CAAQMS) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇవికాకుండా నవంబర్ నాటికి మరో 5 IoT సెన్సార్ ఆధారిత ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యత పరిస్థితిని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వాయు కాలుష్య నియంత్రణలో ప్రజలూ భాగస్వాములు కావాలి
వాయు కాలుష్య నియంత్రణలో పరిశ్రమలతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. వాహనాలకు క్రమం తప్పకుండా పొల్యూషన్ చెక్ చేయించాలని కోరారు.
అలాగే రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ఆకులు, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను పడేయడం, కాల్చడం చేయరాదని సూచించారు.
భవన నిర్మాణ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చూడాలని తెలిపారు. నిర్మాణ పనులు, ఇసుక, మట్టి రవాణా సమయంలో దుమ్ము వ్యాప్తి చెందకుండా లారీలను టార్పాలిన్‌తో పూర్తిగా కప్పి తరలించాలని సూచించారు.
పరిశ్రమలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలి
విశాఖపట్నం వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ, కాలుష్య నియంత్రణ వ్యవస్థల సమర్థ నిర్వహణ, నిర్దేశిత ప్రమాణాల కచ్చితమైన అమలు అత్యంత కీలకమని ఏపీపీసీబీ పేర్కొంది.
విశాఖపట్నంలో వాయు నాణ్యతను మెరుగుపరచడం, కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం పరిశ్రమలు, స్థానిక సంస్థలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో నిరంతరం పనిచేయాలని ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య విజ్ఞప్తి చేశారు.