విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ బీచ్‌లో మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడి మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది.
సముద్రంలో వ్యక్తి తేలుతూ ఉండటాన్ని గమనించిన లైఫ్‌గార్డులు వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో మృతదేహాన్ని సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు.
సమాచారం అందుకున్న మెరైన్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, అతడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై మెరైన్ సీఐ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.