విజయవాడ: ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా, బోధన ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
వైద్య చికిత్స అందించడం ఎంత ముఖ్యమో.. చికిత్స సమయంలో రోగులకు ఎలాంటి హాని జరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న NCD 4.0 కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన 2.83 కోట్ల మందికి పైగా ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 59.38 లక్షల మందిలో అధిక రక్తపోటు, 48.32 లక్షల మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు.
రోగుల వైద్య సమాచారం, పరీక్షల వివరాలు, మందుల వివరాలు, తదుపరి చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ‘సంజీవని’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.