విశాలాక్షినగర్, విశాఖపట్నం, సెప్టెంబరు 18: రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రాయితీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులు అందిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
విశాలాక్షినగర్‌లో సీఎన్‌ఆర్ వెంచర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
భోగాపురం విమానాశ్రయంతో అవకాశాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడులకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఆతిథ్య రంగాలు విస్తరించడం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
భవిష్యత్తులో పర్యాటక, ఆతిథ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. విశాఖలో తాజాగా 16 హోటళ్లకు పర్యాటక శాఖ అనుమతులు జారీ చేసిందని తెలిపారు.
భోగాపురం పరిసర ప్రాంతాలు రానున్న రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ సాటిలైట్ టౌన్‌షిప్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ప్రక్రియతో స్థానిక యువతకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
తెలుగు ప్రజల అభిమానమే నా బలం: నటుడు బాలు
కార్యక్రమానికి హాజరైన ప్రముఖ బుల్లితెర నటుడు బాలు మాట్లాడుతూ సీఎన్‌ఆర్ వెంచర్స్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, వారి ప్రేమాభిమానాలు, ఆదరణ వల్లే తాను బుల్లితెరపై మంచి గుర్తింపు పొందగలిగానని అన్నారు.
ప్రేక్షకులు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువబోనని బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమానికి వచ్చిన బాలుతో ఫొటోలు దిగేందుకు స్థానిక మహిళా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం
సీఎన్‌ఆర్ వెంచర్స్ అధినేతలు చెల్లుబోయిన రాము, చెల్లుబోయిన నర్సింగరావు (చంటిలు) తొలుత ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, నటుడు బాలును సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
తమ సంస్థల అభివృద్ధిలో ప్రజల ఆశీస్సులు, సహకారం ఎంతో కీలకమని వారు తెలిపారు. వ్యాపార కార్యకలాపాలతో పాటు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. తమ పరిధిలో పేదలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు, అయ్యప్ప రెడ్డి, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.