అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిక
వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడంతో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. గతంలో పలు రాజకీయ పార్టీల్లో పనిచేసిన ఆయన, ఇప్పుడు జనసేనలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చేరిక అనంతరం పవన్ కళ్యాణ్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమైయ్యారు.
కాంగ్రెస్ నుంచి జనసేన వరకు.. రాధాకృష్ణ రాజకీయ ప్రస్థానం
దివంగత వంగవీటి మోహనరంగా తనయుడైన రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన, తాజాగా జనసేనలోకి అడుగుపెట్టారు.
విజయవాడ మేయర్ పదవిపై ఆసక్తికర చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ మేయర్ పదవికి జనసేన తరఫున ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే మేయర్ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. అభ్యర్థిత్వం, కూటమిలో సీట్ల కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది.
వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడంతో విజయవాడ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో పార్టీ ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.